Third class student files complaint against father in Telangana
mictv telugu

కొడుకు దిద్దిన కాపురం.. నడుచుకుంటూ స్టేషన్‌కు వెళ్లి..

August 26, 2022

భార్యాభర్తలెవరైనా సరే తల్లిదండ్రులయ్యాక వారి బాధ్యతలతో పాటు కాస్త పద్ధతులను కూడా మరింతగా మెరుగుపరుచుకోవాలి. లేదంటే ఆ ప్రభావం ఎదిగే పిల్లలపై పడుతుంది. ఫలితంగా సమాజానికి ఓ మంచి వ్యక్తినివ్వడాన్ని అటుంచితే వారి బంగారు భవిష్యత్తు పతనమవుతుంది. తన తల్లిదండ్రులు ఇంట్లో గొడవపడడాన్ని చూడలేక ఓ బాలుడు తన వయస్సుకి మించిన సాహసం చేశాడు. తన తండ్రి రోజూ తాగి వచ్చి తన తల్లిని కొడుతున్నాడని మూడో తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. ఆ ప్రాంతంలో నివాసముండే జంగ బాలకిషన్‌ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా బాలకిషన్ మద్యానికి బానిసై చేస్తున్న పని మానేశాడు. బతుకు భారమై కుటుంబ పోషణ నిమిత్తం అతని భార్య దీపిక కూలి పనికి వెళ్తోంది. ఆ కూలీ డబ్బుల కోసం ఆమెను కొట్టి మరీ డబ్బులు లాక్కెళ్లటం చేస్తున్నాడు. పిల్లలు శివాని, భరత్ ల ముందే భార్యను కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు.

తల్లిని కొడుతున్న క్రమంలో అడ్డువెళ్లిన భరత్ను అతడి చెల్లెల్ని కూడా కొట్టాడు. తాగొచ్చి తల్లిని కొట్టటం.. దీంతో ఆమె ఏడవటం.. ఇదంతా చూసి గురువారం ఉదయం తన ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్సై వెంకటేశ్వర్లును కలిసి విషయం మొత్తం చెప్పాడు. ఆ బాలుడు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి.. నేరుగా ఎస్సై వెంకటేశ్వర్లుకే ఈ విషయమంతా చెప్పాడు. ఆశ్చర్యానికి గురైన ఎస్సై “పోలీసులు నీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందా?” అని అడగ్గా.. “తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకంతోనే వచ్చాను సార్‌” అని బదులిచ్చాడు. ఆ మాటల్లో చిన్నోడి తెగువ, బాధ్యత చూసి అబ్బురపోయిన ఎస్సై.. భరత్ ను హత్తుకొని అభినందించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించారు. బాలకిషన్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కావద్దని హెచ్చరించి ఇంటికి పంపించారు.