మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరిరోజును కనుమ అంటారు. దీనిని పశువులు పండగ అని పిలుస్తారు. ఏడాదిపాటు కష్టపడి పండించిన రైతులకు వ్యవసాయంలో సాయం అందించే పశుపక్షాదులకు ఈ కనుమ రోజును అంకితం చేస్తారు. కనుమ రోజు ఎలాంటి పూజలు చేయాలి. ఎలా జరుపుకోవాలి. తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో కాలానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా కాలాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని కాలము అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈవిధంగా సూర్యభగవానుడు ధనుస్సురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకరసంక్రాంతి అని పిలుస్తారు.
ఉత్తరాయణము ప్రాశస్త్యం గురించి:
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఏడాదిలో 12 మాసములు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఇలా సూర్యుడు 12 రాశులలో సంచరించే కాలమును ఏడాది అంటారు. ఈ ఏడాది కాలమును 2 ఆయనములుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణము, రెండవది దక్షిణాయణము. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి ధనూ రాశికి సంచరించే కాలమును దక్షిణాయనముగా పిలుస్తారు. అలాగే మకరరాశి నుండి మిథున రాశి మధ్య సంచరించే కాలమును ఉత్తరాయణముగా పిలుస్తారు.
కనుమ రోజు పూజా నియమాలు
ఉత్తరాయణములో మొదటి రోజు మకర సంక్రాంతి, రెండవ రోజును కనుమగా, మూడవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. కనుమ అంటే పశు వుల పండుగ. సంక్రాంతి సమయానికి పంట చేతికి వస్తుంది. ఈ పంట రైతుల చేతికి రావడానికి పశుపక్ష్యాదులు ఎంతో సాయం చేస్తాయి. అందుకే దీనిని కనుమ అని పిలుస్తారు. శాస్త్రం ప్రకారం కనుమ రోజు గోవులను పూజిస్తారు. పశువులకు ఆహారాన్ని అందిస్తారు. పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. గారెలను నైవేద్యంగా పెడతారు. ఈ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. కనుమ నాడు పితృదేవతలకు ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి సుష్టుగా భోజనంచేయాలి అందుకే కనుమనాు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.