దగ్గుతో వైరస్ ఎక్కడికి వ్యాపిస్తుందో చెప్పే ఫ్లూసెన్స్ పరికరం - MicTv.in - Telugu News
mictv telugu

దగ్గుతో వైరస్ ఎక్కడికి వ్యాపిస్తుందో చెప్పే ఫ్లూసెన్స్ పరికరం

March 21, 2020

Flusense

కరోనా వైరస్‌ ఎక్కడ వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ‘ఫ్లూసెన్స్‌’ అనే పరికరాన్ని తయారు చేశారు. అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణను కనిపెట్టారు. ఈ పరికరం ఎలా పనిచేస్తుందో వారు వివరించారు. గుంపులుగా గుమికూడిన జనాల మధ్యలో ఎవరైనా దగ్గితే వారి దగ్గును ఈ పరికరం విశ్లేషిస్తుంది. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారంగా పనిచేసే ఈ పరికరం కరోనా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన లక్షణాలను విశ్లేషిస్తుంది. 

మైక్రోఫోన్‌, థర్మల్‌ కెమెరా వంటి పరికరాలతో వ్యక్తుల శరీర వేడిని, దగ్గును ఈ పరికరం కనిపెడుతుంది. నాలుగు ఫ్లూసెన్స్‌ పరికరాలను పరిశోధకులు మసాచూసెట్స్‌ విశ్వవిద్యాలయ ఆవరణలో అమర్చారు. చికిత్సకోసం వచ్చే వారు వేచి ఉండే గదుల్లో వీటిని ఏర్పాటుచేశారు. వీటి నుంచి సేకరించిన డేటాను రాస్ప్‌బెర్రీ పై కంప్యూటర్‌ ద్వారా ప్రాసెస్‌ చేస్తారు. ఇది దగ్గు శబ్ధాన్ని గుర్తించే న్యూరల్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానించి ఉంటుంది. ప్రజల సంఖ్యను, దగ్గుతో వైరస్ ఎక్కడనుంచి వ్యాపిస్తుందో చూపిస్తుంది. ఏడు నెలల వ్యవధిలో ప్రజల నిరీక్షణ స్థలాల నుంచి 3లక్షల 50 వేల కంటే ఎక్కువ థర్మల్‌ ఇమేజ్‌లను, 21 మిలియన్ల ఆడియో నమూనాలను ఫ్లూసెన్స్‌ సేకరించింది. 81శాతం కచ్చితమైన ఫలితాలను అందజేసింది. అయితే ఇది వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తుందా లేదా అన్నది తెలియాలంటే దీనిని మరికొంత కాలం పరీక్షించాలని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దీని ద్వారా గుర్తించే అవకాశం లేనందున.. భవిష్యత్‌ అవసరాల కోసం దీనిని తయారు చేస్తున్నారు.