కాంగ్రెస్లో ప్రముఖ వ్యూహకర్త పీకే చేరతారని జోరుగా చర్చలు నడిచిన విషయం తెలిసిందే. అయితే సడెన్గా మంగళవారం పీకే కాంగ్రెస్లో చేరబోవడం లేదని పీకేతో పాటు కాంగ్రెస్ కూడా స్పష్టం చేసింది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కారణాలు ఇలా ఉన్నాయి.
పార్టీని గ్రౌండు లెవెల్ నుంచి పునరుద్ధరించేందుకు పీకే సూచనలు అధిష్టానానికి నచ్చాయంట. కానీ, పీకే అడిగిన పదవులు ఇవ్వడానికి సీనియర్లతో పాటు అధిష్టానం కూడా ఒప్పుకోలేదు. ఇంతకీ పీకే చేసిన సూచనలేంటంటే.. పార్టీలో ఓటు వేయించలేని నాయకులకు పదవులివ్వకూడదు. వయసు మళ్లిన నాయకులకు క్రియాశీల బాధ్యతల నుంచి తప్పించాలి. గాంధీల కుటుంబం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అయినా తీసుకోవాలి, లేదా ప్రధానమంత్రి అభ్యర్ధిగానైనా ఉండాలి. రెండూ కావాలంటే పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలు తక్కువ. కాబట్టి గాంధీల కుటుంబం ఆమేరకు త్యాగం చేయాల్సిందే. ప్రియాంకా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలి. తనకు పార్టీలో సమాచారం చేరవేసే బాధ్యతలతో పాటు ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనే అంశంలో పూర్తి స్వేచ్చ ఇవ్వాలంటూ ఇలా పలు సూచనలు చేశారు. అయితే వీటిలో కొన్ని అభ్యంతకర విషయాలున్నాయని సీనియర్ లీడర్లు సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ప్రియాంకను అడ్డుపెట్టుకొని పీకే వెనుక నుంచి మొత్తం పార్టీని తన ఆదుపులో పెట్టుకుంటాడనేది ప్రధాన ఆరోపణ. ఇంకో ముఖ్య విషయం ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛను పీకేకు ఇస్తే.. అధిష్టానంతో పాటు పీసీసీలు, జిల్లా అధ్యక్షులు పాత్ర నామమాత్రం అవుతుంది కాబట్టి ఇలాంటి షరతులతో పార్టీలోకి చేర్చుకోవద్దని కేవలం సలహా దారుడిగా పార్టీ కమిటీలో సభ్యుడిగా ఉండమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో నొచ్చుకున్న పీకే దీని కంటే పార్టీ బయట ఉండి సూచనలు, సలహాలు ఇస్తే సరిపోతుందని భావించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేస్తూ ‘కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరం’ అంటూ అభిప్రాయపడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక, పీకే సలహా ప్రకారం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే పార్టీ అస్థిత్వానికే ప్రమాదమని సీనియర్ లీడర్లు హెచ్చరించారు. మరోవైపు పీకే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేస్తున్నారు. వాటిని వదులుకొని పార్టీ పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్లో చేర్చుకోవాలని మెజారిటీ నేతలు సూచించినట్టు తెలుస్తోంది.