ఈ దాడి చేయించింది..రేవంత్ రెడ్డినే: మల్లారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దాడి చేయించింది..రేవంత్ రెడ్డినే: మల్లారెడ్డి

May 30, 2022

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వాహనంపై ఆదివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరికి చెందిన ఘట్‌కేసర్ శివారులో రెడ్డి సింహగర్జన మహాసభలో మల్లారెడ్డి వాహనంపై పలువురు కార్యకర్తలు కుర్చీలు, చెప్పులు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మల్లారెడ్డిన సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై మల్లారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..”పీసీసీ రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నందుకే నాపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే ఉన్నాడు. ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే అక్కసుతో నాపై రేవంత్ రెడ్డి అతని అనుచరులతో దాడి చేయించాడు. ఈ దాడులకు నేను భయపడా. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగానే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పదు. రెండేళ్లు కరోనా, లాక్‌డౌన్ కారణంగా కొంత ఆలస్యమైంది. అదే విషయాన్ని నేను సభలో చెప్పాను. రెడ్లకు న్యాయం జరుగుతుందని చెప్తుండగానే వ్యతిరేక నినాదాలు చేసి, నన్ను వేదిక నుంచి దిగిపోయేలా చేశారు” అని ఆయన అన్నారు.

రెడ్ల సభలో మల్లారెడ్డి ఏం మాట్లాడారు? ఎందుకు కార్యకర్తలు కుర్చీలు, చెప్పులు విసిరారు? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. మల్లారెడ్డి మాట్లాడుతూ..”స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు ప్రతి పల్లెలో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుదలకు కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉంది. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు. ఆసరా, రైతుబీమా, రైతుబంధు, దళితబంధు పథకాలను మా ప్రభుత్వమే అమలు చేస్తోంది” అని చెబుతుండగా, కొంతమంది కార్యకర్తలు మాట్లాడటం ఆపాలంటూ అరుపులు, కేకలు వేశారు. వెంటనే మల్లారెడ్డి ప్రసంగం ముగించి, వేదిక నుంచి కిందికి దిగారు. దాంతో కార్యకర్తలు మల్లారెడ్డిని అడ్డుకున్నారు. కుర్చీలు, రాళ్లు, చెప్పులతో వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మల్లారెడ్డి కారును వెంబడిస్తూ, దాడికి పాల్పడ్డారు.