‘వైద్యో నారాయణో హరి‘అని ఊరికే అనలేదు. అంతటి విష్ణువంతా శక్తిమంతుడని అంటుంటారు. అతనికి ఎంత ఇచ్చినా తక్కువే. అయితే ఆస్ట్రేలియాలో ఒక పట్టణం మాత్రం అక్కడ వైద్యులకు సంవత్సరానికి 6.56కోట్ల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది. ఎందుకో తెలుసా? ఆస్ట్రేలియాలోని ఒక టౌన్ వైద్యులకు వార్షిక వేతనం 8లక్షల డాల్లరు అంటే.. సుమారు 6.56కోట్ల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు.. వారికి అద్దె లేకుండా నాలుగు పడకల గదుల ఇంటిని కూడా ఉచితంగా ఇస్తామని అంటున్నది. దీని వెనుక కారణం ఉంది.
ఇబ్బందుల వల్లే..
క్వాయిరెడింగ్ అనే పట్టణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని వీట్ బెల్ట్ ప్రాంతంలో ఉంది. ఇది పెర్త్ కు తూర్పున ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే రెండు గంటల ప్రయాణం. అయితే ఈ పట్టణంలో నెల రోజులుగా పర్మినెంట్ రెసిడెన్షియల్ డాక్టర్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సదుపాయాలు, వైద్యుల కొరతను పరిష్కరించడానికి ఈ టౌన్ కౌన్సిల్ నిర్ణయించుకుంది. అందుకే ఈ ఆఫర్ ప్రకటించింది. ఇందులో సిబ్బంది ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఈ జీతంతో పాటు అదనంగా బోనస్లు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తామంటున్నదీ కౌన్సిల్.
అదనంగా..
ఆస్ట్రేలియాలోని చిన్న పట్టణాల్లో వైద్యుల కొరత ఎక్కువ ఉన్నట్లు అక్కడి కౌన్సిల్ ప్రకటించింది. ఈ వీట్ బెల్ట్ పట్టణంలో కేవలం 619మంది మాత్రమే ఉన్నారు. ఈ ఒక్క పట్టణమే కాదు.. చాలా పట్టణాల్లో కూడా చాలా ఆసుపత్రులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పట్టణం ప్రకటించిన దాని ప్రకారం.. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇక్కడ ఆ వైద్యుడు ఉండాలి. వారు పట్టణంలో ఐదు సంవత్సరాలకు పైగా పని చేస్తే అదనంగా రెండు సంవత్సరాలకు 12వేల డాలర్లు(9.94 లక్షల రూపాయలు), ఐదు సంవత్సరాలకు.. 23వేల డాలర్లు (రూ.19.05లక్షలు) బోనస్ గా అందుకుంటారు.
గణాంకాల ప్రకారం..
జాతీయ గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో వైద్య విద్యార్థులు కేవలం 14శాతం మంది మాత్రమే వైద్య వృత్తిని కొనసాగించాలనుకుంటున్నారు. అందులో 4.5శాతం మంది మాత్రమే చిన్న పట్టణాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.