This boy is a culinary artist
mictv telugu

వంటల ఆర్టిస్ట్ ఈ అబ్బాయి

November 21, 2022

అతడి చేతిలో పడితే పండ్లు పువ్వులుగా మారిపోతాయి. కూరగాయలు లతల్లా అందంగా అల్లుకుపోతాయి. పదిహేడేళ్ల ప్రాయంలోనే పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి… ‘కలినరీ ఒలింపిక్స్‌’లో నాలుగు రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన చెన్నై చెఫ్‌ యశ్వంత్‌కుమార్‌ ఉమాశంకర్‌ జర్నీ ఇది…

యశ్వంత్‌ బాల్యం అందరి పిల్లల్లా సాగలేదు. బొమ్మలతో ఆడుకోలేదు. చుట్టుపక్కల పిల్లలతో కలిసి తిరగలేదు. వంటింట్లో నాన్న ఉమాశంకర్‌ ధనపాల్‌ వంటలు చేస్తుంటే… ఆయన వెంటే ఉండేవాడు. పాకశాస్త్రంలో ఆయన ప్రావీణ్యుడు. చెన్నైలోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో పేరున్న చెఫ్‌. ‘కలినరీ ఒలింపిక్స్‌’లో భారత్‌కు రెండుసార్లు కాంస్య పతకాలు తీసుకొచ్చారు. రకరకాల వంటలు వండడం… వండినదాన్ని అందంగా అలంకరించడం… కాయగూరలు, పండ్లను శిల్పాల్లా చెక్కడం… ఇవే చిన్న వయసులో యశ్వంత్‌ను వంట గది వైపు అమితంగా ఆకర్షించాయి.

నాన్న వంటలు చూస్తూ పెరిగిన యశ్వంత్‌కు చివరకు అదే తన జీవిత ఆశయంలా మారింది. గరిట పట్టడం రాని వయసులోనే పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. వండటమే కాదు… ఆ వంటను చూడగానే తినాలనిపించేలా ఆకర్షణీయంగా అలంకరించడంలోనూ నైపుణ్యాన్ని సాధించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చెన్నైలో జరిగిన కుకరీ కాంపిటీషన్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. అది మొదలు అతడి ప్రావీణ్యం జాబితాలో రోజుకో రుచికరమైన వంట వచ్చి చేరుతోంది. పండైనా… కూరగాయ అయినా విభిన్నమైన డిజైన్‌లో ఒదిగిపోతోంది.

పాకశాస్త్రంపై ఉన్న మక్కువతో యశ్వంత్‌ చదువును కూడా పక్కన పెట్టేశాడు. గత ఏడాది జర్మనీలో జరిగిన ‘కలినరీ ఒలింపిక్స్‌ 2020’లో ఏకంగా నాలుగు రజత పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించాడు. 59 దేశాల నుంచి మొత్తం రెండు వేల మంది చేయి తిరిగిన చెఫ్‌లు పోటీపడిన ఈ ఒలింపిక్స్‌లో యశ్వంతే అందరికంటే చిన్నవాడు. వెజిటబుల్‌ కార్వింగ్‌, కలినరీ ఆర్ట్‌కు సంబంధించిన నాలుగు విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించాడు.

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సూపర్‌ చెఫ్‌ చెన్నై పోటీల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానం దక్కించుకున్నాడు. కలినరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా టోర్నీలో 5 స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచాడు. సెలబ్రిటీ చెఫ్‌ కావాలనుకుంటున్న యశ్వంత్‌ వంటలకు సంబంధించిన సొంత బ్రాండ్‌ ఒకటి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంకల్పమే బలంగా… ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా… దూసుకుపోతున్న ఈ చెన్నై కుర్రాడి ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.