ఓ మంచి పనిని చెడగొట్టేందుకే ఈ ప్రచారం: ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓ మంచి పనిని చెడగొట్టేందుకే ఈ ప్రచారం: ప్రకాశ్ రాజ్

February 22, 2022

08

సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 20వ తేదీన ముంబైలో పర్యటించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తోపాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా వెళ్లారు. దీంతో ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ బంపరాఫర్ ఇచ్చారా..? ప్రకాశ్ రాజ్‌కు ఎవరూ ఊహించని పదవి దక్కనుందా..? ప్రకాశ్ రాజ్‌ త్వరలోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారా..? అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా నేటికీ జోరుగానే సాగుతోంది.

అయితే, ఈ ప్రచారాలపై మంగళవారం ప్రకాశ్ రాజ్ స్పందించారు. “తెలంగాణ నుంచి నన్ను రాజ్యసభకు పంపుతారనేది స్పష్టంగా తెలియదు. ఓ మంచి పనిని చెడగొట్టేందుకు మాత్రం ప్రచారం జరుగుతోంది. మాట్లాడ్డానికి ఇది సరైన సమయం కాదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగిన విధంగా తన బృందాన్ని రూపొందించుకుంటున్నారు” అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

మరోపక్క కేసీఆర్ టీమ్‌లో ప్రకాశ్ రాజ్‌కు కూడా స్థానం కల్పించినట్టు తెలుస్తోందని, అనేక భాషలపై పట్టు, జాతీయ రాజకీయాలపై లోతైన అవగాహన, ప్రధానంగా బీజేపీపై వ్యతిరేకత, ఇవన్నీ ప్రకాశ్ రాజ్‌ను కేసీఆర్‌కు దగ్గర చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.