ఈ ఘనత మాదే: రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఘనత మాదే: రేవంత్ రెడ్డి

April 16, 2022

 revanth

కేసీఆర్ సర్కార్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..” తెలంగాణలో అన్నదాతలు పండించిన పంటను కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తున్న ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే. పంట వేయక కొందరు, పంటను తక్కువ ధరకు అమ్ముకొని మరికొందరు రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు రూ. 600 బోనస్ ఇవ్వాలి. మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రూ. 8వేల కోట్ల కుంభకోణం చేశాయి. ఎఫెసీఐకి చెందిన బియ్యం మాయం అయ్యాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి” అని అన్నారు.

ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ అదుపులో ఉండాలి. జిల్లాలో ఆయన అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయి. కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు. నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొనున్నారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికే రాహుల్ గాంధీ వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి పలు విషయాలను వెల్లడించారు.