ప్రింట్ చేసిన కాగితాన్ని ఇక క్లీన్ చేసి 10 సార్లు వాడుకోవచ్చు..
ఏదైనా వైట్ పేపర్‌ను ప్రింటర్ లో పెట్టి అవసరమనుకున్న టెక్స్ట్‌ను ప్రింట్ చేసి వాడుకుంటాం. ఇప్పటివరకూ చాలా ఆఫీస్‌లలోనూ, స్కూల్స్, కాలేజీలలోనూ ఇలాగే అనేక కాగితాలను ప్రింటింగ్‌కు ఇస్తూ ఉంటాం. అవసరం తీరాక అదే పేపర్‌ను డస్ట్ బిన్‌లో పడేస్తాం. అలా కాకుండా ఆ పేపర్ పై ఉన్న ప్రింటింగ్ ను చెరిపేసి, మళ్లీ వైట్ పేపర్ లా వాడుకుంటే ఎలా ఉంటుంది..? అవును.. వైట్ పేపర్ పై ప్రింట్ ఇచ్చాక దాన్ని తిరిగి వైట్ పేపర్ లా మార్చేయొచ్చు. అలా ఒకసారి కాదు 10సార్లు చేయవచ్చు. అంటే ప్రింట్ ఇచ్చి చెరిపేసి..మళ్లీ మళ్లీ తెల్లకాగితంలా మార్చి వాడుకోవచ్చు.అలా 10సార్లు వాడుకునే టెక్నాలజీని రూపొందించింది ఇజ్రాయిల్ కు చెందిన ‘రీప్ సంస్థ’.
సదరు సంస్థ.. ప్రింటింగ్ అయిన కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్’ను రూపొందించింది. అంటే ప్రింటర్ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్ సర్క్యులర్ ప్రింట్ (ఆర్‌సీపీ)’ అని పేరు పెట్టారు. ఈ పేపర్‌ను ప్రింటర్‌లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ప్రింట్ అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. దీని వల్ల మళ్లీ మళ్లీ తెల్లకాగితాలు కొనుక్కోనవసరం లేదు.. పైగా పేపర్లు వేస్ట్ కాకపోవటం వల్ల పర్యావరణానికి మేలు కూడా జరిగినట్లు అవుతుంది. కాగితం తయారీకి అవసరమైన చెట్లను పరిరక్షించవచ్చు. కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది.