ఆ వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్.. గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.."స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోంది. దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. ఆ మహానీయుల త్యాగాల వల్లే ఈరోజు స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నాం. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయం ఇది" అని కేసీఆర్ అన్నారు.