అడవులను నరికి, ఊళ్లల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పోగు చేస్తున్న మనుషులు మూగజీవాలను ఎంతగా హింసిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగుల మంద ఒకటి చెత్త డంప్ యార్డులో పడి ఏరుకుతింటున్న ధీనమైన ఫొటోలు ఎందరినో కదిలిస్తున్నాయి. వాటి ఆకలి పోరాటం చూసి జంతు ప్రేమికులు కుమిలిపోతున్నారు. ఈ ఏడాదిలో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (RSB) ఫోటోగ్రఫీ పోటీలో ఈ ఏనుగుల మంద (story Of Pallakaddu Elephants) ఫొటో మొదటి బహుమతి గెలుచుకుంది. శ్రీలంకలోని అంపారా జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉన్న చెత్త డంప్ వద్ద ఫొటోగ్రాఫర్ కెమెరాకు ఏనుగులు ఇలా చిక్కాయి.
ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అయిన టలాక్సన్ థర్మపాలన్ తన కెమెరాలో బంధించాడు. అక్కడి ఏనుగుల దుస్థితిని కళ్లకు కట్టాయి అతని ఫొటోలు. ప్రతి సంవత్సరం వందలాది ఏనుగులు అక్కడి వ్యర్థాలు తిని తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ ఫొటోను చూసి అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకున్నారు. ఏనుగులు సంచరించే ప్రదేశాల్లో చెత్తను వేయడాన్ని నిషేధించారు. ఈ ఏడాదిలో ‘Our Changing World’ అనే థీమ్‌తో నిర్వహించిన పోటీ కోసం ఎంపిక చేసిన అనేక ఫొటోలలో థర్మపాలన్ ఫొటోకు మొదటి బహుమతి కింద నగదు కూడా అందించారు. పోటీలో అతను 1,000 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.72వేలు పైనే) నగదు బహుమతి గెలుచుకున్నాడు. ‘నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఫొటోగ్రాఫర్లలో ఈ అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నా భవిష్యత్ ప్రాజెక్టులకు మరిన్ని బాధ్యతలను ఇస్తుంది’ అంటూ తన ఆనందాన్ని ఫేస్బుక్లో పంచుకున్నాడు. అతని పోస్టును చూసి నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏనుగుల ధీనస్థితిని వెలుగులోకి తెచ్చిన అతని పనితనాన్ని వేనోళ్ల పొగిడారు.