100 రోజులు  నిద్రపోతే రూ.1,00,000 మీదే..  - MicTv.in - Telugu News
mictv telugu

100 రోజులు  నిద్రపోతే రూ.1,00,000 మీదే.. 

November 29, 2019

sleep.

ఏదైనా పోటీలో పాల్గొంటే బహుమతులు ఇస్తారు. సదరు పోటీల్లో శారీరక శ్రమో, జ్ఞానాని సంబంధించో పోటీ ఉంటుంది. కానీ ఏమీ చెయ్యకుండా ప్రైజ్ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా.. ఓహో లాటరీ కావచ్చని అని అనుకుంటున్నారు కదూ. అవేవీ కాదు. మీరేం పని చెయ్యకుండా కేవలం నిద్రపోవాలి అంతే. అవును, కేవలం నిద్రపోతేనే రూ.1,00,000 ఇస్తామని ఓ కంపెనీ  ప్రకటించింది. పోటీలో ఎలాంటి శ్రమలేదు కాబట్టి హాయిగా కళ్లు మూసుకుని నిద్రపోయి డబ్బులు కొట్టేయ్యాలని ఉవ్వీళ్లూరుతున్నారు కదూ. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ స్లీప్ సొల్యూషన్స్ సంస్థ వేక్ ఫిట్ ఈ ప్రకటన చేసింది. రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోతే చాలు నగదు బహుమతి ఇస్తామంటోంది. ఇందుకోసం ‘వేక్‌ఫిక్ స్లీప్ ఇంటర్న్‌షిప్’ పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. 

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రోజూ 9 గంటల చొప్పున 100 రోజులపాటు నిద్రపోవాల్సి ఉంటుంది. అదికూడా వేక్‌ఫిట్ కంపెనీ మ్యాట్రెస్ పైనే నిద్రపోవాలి. అధునాతన ఫిట్‌నెస్, స్లీప్ ట్రాకర్ ద్వారా వారిని పరిశీలించడంతో పాటు నిపుణులతో కౌన్సిలింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తారు. నిద్ర ఎలా పట్టిందో వీడియోలో వివరించాల్సి ఉంటుంది. అలా విజయవంతంగా 100 రోజుల పాటు రోజూ 9 గంటల చొప్పున నిద్రపోయినవారికి రూ.1,00,000లను కంపెనీ బహూకరిస్తుంది. ఎంపికైనవారికి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. పైజామాలు మాత్రమే ధరించి నిద్రపోవాలి అన్నది కంపెనీ నిబంధన. 

ఇంకే నిద్రపోవడం ఇష్టమైనవాళ్లు ఈ ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం… 100 రోజులు నిద్రపోయి రూ.1,00,000 పారితోషికం తీసుకోవాలనుకుంటే వేక్‌ ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయండి. కాగా, అంతరిక్ష పరిశోధనలో భాగంగా 2 నెలలు మంచంపై ఉంటే నాసా రూ.14 లక్షలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.