వీకెండ్ వస్తే చాలామంది రెస్టారెంట్‌లకో, పార్టీలకో లేదంటే ఫంక్షన్లకో వెళ్తుంటారు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, అన్ని ప్లేట్లలో నింపుకుంటారు. కానీ ఆ ప్లేట్‌లో ఉన్న ఆహారమంతా తినలేక చివరికి పారేస్తుంటారు. బయట హోటల్లోలోనే కాదు.. ఇళ్లల్లో కూడా ఇలాగే చేస్తుంటారు. ఆ మాటకొస్తే ఇంట్లోనే ఎక్కువ శాతం వండిన ఆహారమంతా వృథా చేస్తారు. అటువంటి వ్యక్తుల్లో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 60కే కోరినంత భోజనం పెడతామని, అయితే దీనికి షరతులు వర్తిస్తాయని ఓ ట్విస్ట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని కర్నావత్ రెస్టారెంట్‌లో ఎంత తిన్నా ఫరవాలేదు కానీ ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదని యాజమాన్యం హెచ్చరించింది.
అయితే, ఆ జరిమానా కూడా ఎక్కువేం కాదు, కేవలం రూ.50తో సరిపెట్టింది. ఈ నిబంధనలు అందరికీ స్పష్టంగా కనిపించేలా రెస్టారెంట్ గోడలపై పోస్టర్లను అతికించింది. దీంతో రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. బోర్డు చూసి లోపలికి వెళ్లిన వారంతా తాము తినగలిగినంత తిని బిల్లు చెల్లించి జాగ్రత్తగా బయటికి వస్తుంటారు. రూ. 60లకే అవసరమైనంత ఆహారం దొరకుతుందనే ఆఫర్‌కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది. అయితే, కొందరు తాము తినేదాని కంటే ఎక్కువ పెట్టించుకుని చివరకు వృధా చేస్తారని భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చినదే ఈ జరిమానా ఆలోచన.
రెస్టారెంట్ యజమాని అరవింద్ సింగ్ కర్నావత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆహారాన్ని వృథా చేయకూడదనే అలవాటును ప్రజల్లోకి తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తున్నాం. రైతులు ఎంతో కష్టపడి పండించిన ఆహారాన్ని వృథా చేయడం అనైతికం. కనీసం రెండు పూటలా భోజనం కూడా చేయలేని వారు ఎందరో ఉన్నారు. మా రెస్టారెంట్‌కు వచ్చినవారంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇక్కడ కస్టమర్లు వదిలేసిన ఆహారాన్ని పారవేయడం లేదు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్నామని’ ఆయన అన్నారు.