ఆఫీసులకు, కాలేజీలకు సరైన సమయానికి వెళ్లాలని ముందుగానే ఇంటి నుంచి బయల్దేరతాం. రోడ్లపై గుంతలున్నా.. ట్రాఫిక్ ఉన్నా.. అవన్నీ తప్పించుకొని.. ముందెకెళ్లేలోపు రెడ్ సిగ్నల్ పడుద్ది. ఒక నిమిషం లేదా అరనిమిషం వెయిట్ చేస్తే.. గ్రీన్ సిగ్నల్ పడ్డాక వెంటనే స్టార్ట్ అవ్వొచ్చు అనుకుంటాం. కానీ ఈ లోపే పిలవని బంధువుల్లా, అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారుల్లా మన ముందు వచ్చి నిల్చుంటారు కొందరు. వారే బిచ్చగాళ్లు, హిజ్రాలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్లు. తక్కువలో తక్కువగా ప్రతీ సిగ్నల్ వద్ద పది మంది ఉంటారు. కారు అద్దాలు తీసేంత వరకు వదలరు. ఇక హిజ్రాలైతే బైక్‌ల వస్తున్న వారి జేబులపైనే చేయేసే ప్రయత్నం చేస్తారు. పట్టుకొని అడిగినంత ఇచ్చేంత వరకు కదలరు.
డబ్బులివ్వకపోతే తెగబడుతున్నరు..
దాదాపు నగరంలోని ప్రతీ సిగ్నల్స్ వద్ద రోజూ ఎదుర్కొంటన్న సమస్య ఇది. అందరికీ ఇలాంటి ఘటనలు ఎక్స్‌పిరియన్స్ అయినా ఎవరికీ చెప్పలేం. ఇదంతా మామూలే అని వదల్లేం.. అలా అని పీఎస్ కంప్లైంట్ చేసేంత నేరమేమీ కాదులే అని సమర్థించుకుంటాం. కానీ రోజూ ఇదే పరిస్థితి. ఒక్కోసారి సిగ్నల్స్‌తో సంబంధం లేకుండానే ట్రాఫిక్ జామ్ టైమ్‌లో చిన్న చిన్న పిల్లలను చేత్తో ఎత్తుకొని దీనంగా వచ్చే ఆడవాళ్లను ఏమీ అనలేని పరిస్థితి. వారు మాత్రమే కాదు వృద్ధులు, దివ్యాంగులు.. చప్పట్లు కొట్టుకుంటూ వచ్చే హిజ్రాలు.. జనాలకు ఇబ్బంది కలుగుజేస్తూ వారిచ్చే డబ్బులతోనే దర్జాగా గడుపుతున్న వాళ్లు ఎందరో ఈ నగరంలో. సొమ్ము చేతిలో పడకుంటే చేతిలో ఇనుప వస్తువులతో ఖరీదైన కార్లపై రంగును తొలగించేందుకు కూడా బరితెగిస్తున్నారు. 2-3 ఏళ్ల వయసున్న పిల్లలు, దివ్యాంగులు వాహనాలకు ఎదురుగా రావడంతో అకస్మాత్తుగా బ్రేకులు వేస్తున్నారు. వెనుక ప్రయాణించే వాహనాలు ప్రమాదాల బారిన పడేందుకు కారణమవుతున్నారు.
మాకేనా ట్రాఫిక్ రూల్స్.?
ట్రాఫిక్ సిగ్నల్స్ , ట్రాఫిక్ రూల్స్ పాటించలేదన్న కారణంతో చలాన్లు వేస్తున్నారు పోలీసులు. మరి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఇలాంటి వారిపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోరా అని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. విదేశాల నుంచి ఎవరైనా అతిథులు, ప్రముఖులు నగరానికి వచ్చినప్పుడు.. బాలకార్మికులు, బిచ్చగాళ్లను రోడ్లపై కనిపించకుండా తీసుకెళ్లి శివారు ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. మళ్లీ కొన్ని రోజులకి అంతా మామూలే. దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడని అంతా అడుగుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపైనే మీటింగ్ నిర్వహించారట. యాచకులు, బాలకార్మికులను గుర్తించి చర్యలు కూడా తీసుకోవాలన్నారు. సంవత్సరం కావొస్తుంది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇలాంటి ఇబ్బందులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారా అని సామాన్యడు ఎదురు చూస్తున్నాడు,