This is all a script written by KCR.. Bandi Sanjay fire on the Poaching of TRS MLAs..
mictv telugu

పోలీస్ కమిషనర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్

October 27, 2022

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై బండి ఫైర్ అయ్యారు. ఇది అంతా కేసీఆర్ అల్లిన స్క్రీప్ట్ అని ఆరోపించారు. అన్ని ఛానళ్లలో బీజేపీ ఇదంతా చేసిందంటున్నారని… మీడియాతో సీఎం కేసీఆర్‌ చెప్పిస్తున్నారని అన్నారు. ఈ రోజు కాకుంటే రేపైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అప్పుడు ఆ ఛానళ్ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. నిన్న జరిగిన డ్రామాలో ఫాంహౌజ్ వాళ్లదే… డబ్బులు తరలించిన కారు కూడా ఎమ్మెల్యేదేనని.. ఫిర్యాదు చేసింది వాళ్లే… బాధితులు వాళ్లేనని అన్నారు.

ఈ సందర్భంగా తాను రేపు ఉదయం 9 గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి వద్దకు నేనొస్తున్నా… కేసీఆర్… నీకు ఈ ఎపిసోడ్ తో సంబంధం లేదనుకుంటే… రేపు అక్కడికి రావాలి. నాతోపాటు ప్రమాణం చేయాలి. రేపు ఉదయం 9 నుండి 10 గంటలకు యాదాద్రి వద్ద ఎదురు చూస్తా అని సవాల్ విసరారు. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికే ఇట్లాంటి డ్రామాలు చేస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఇంకెన్ని వేషాలు వేస్తారోనని ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారన్నారు.

“ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు… ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదు? వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? పైగా బీజేపీ ఇదంతా చేయించినట్లుగా పోలీస్ కమీషనర్ లీక్ ఎట్ల ఇస్తడు? “ అని పోలీస్ కమిషనర్‌పై సీరియస్ అయ్యారు సంజయ్. “అందులో బీజేపీ వాళ్లెవరున్నరు? ఎంత ధైర్యం? వాళ్లు బీజేపోళ్లని ఎట్లా చెబుతవ్? అసలు డబ్బులేవి? ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు ఆ డబ్బు వివరాలు బయటపెట్టలే? అందులో ఎంత సొమ్ము నొక్కేస్తున్నవ్? పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు తీసుకెళ్లి మళ్లీ సీఎం ఆధ్వర్యంలో బయట ఏం చెప్పాలో ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తున్నావ్” అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని… బీజేపీని అకారణంగా బదనాం చేసేందుకు యత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.