పన్నెండు పుష్కరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి ఈసారి రానుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ శివరాత్రికి ఆ శివయ్య దర్శన భాగ్యం కలుగదని చెబుతున్నారు పండితులు. ఆ ముక్కంటీశ్వరుడికి శివరాత్రి రోజున పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతాల్లో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుతారు. మహాశివరాత్రి రోజున శివుడు మహాలింగ రూపంలో ఉద్భవించాడని అంటుంటారు.
ఈ మహాశివరాత్రి 144 యేండ్ల తర్వాత వస్తున్నదని పండితులు చెబుతున్నారు. శనిత్రయోదశి, మహాశివరాత్రి కలయిక జరుగడం అరుదు. అలాంటిది ఈ సంవత్సరం జరుగుతున్నది. అందుకే ఆ మహా శివుడి దర్శనం తప్పక చేసుకోవాల్సిందేనంటున్నారు పండితులు. ఉపవాసం చేసి, జాగారణ చేస్తుంటారు చాలామంది. అయితే ఈసారి రాత్రంతా జాగరణ చేస్తే అనుకున్నది సిద్ధిస్తుందంటున్నారు పండితులు.
శివరాత్రి ఈసారి ఉత్తరషాఢ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రాల్లో కలిసి రావడం కూడా ఇక్కడ విశేషం. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి, అలాగే శ్రవణా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఇలా సూర్యచంద్రులు అధిపతులుగా ఉన్న రోజున శివపూజ చేయడం కూడా చాలా శ్రేష్టం. ఈరోజు పూజలు చేస్తే మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నమ్ముతారు పండితులు. ఇలాంటి ఒక శివరాత్రి రావాలంటే మళ్లీ 12 పుష్కరాలు అంటే.. 144 సంవత్సరాల వరకు ఆగాల్సిందే! కాబట్టి ఆ ముక్కంటిని భక్తి, శ్రద్ధలతో పూజించండి. ఆయన కృపకు పాత్రులుకండి.