This is my house'..Anantapuram District SP
mictv telugu

‘నా ఇల్లు ఇదే’..అనంత‌పురం జిల్లా ఎస్పీ

September 1, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి ఫ‌కీర‌ప్పపై గత రెండు రోజులుగా ప‌లు ఆరోప‌ణ‌లు వస్తున్న విషయం తెలిసిందే. డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు..ఈరోజు ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదైంది. జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఫ‌కీర‌ప్పపైనే కేసు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రమంలో ఎస్పీ ఫ‌కీర‌ప్ప కాసేపటిక్రితమే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో అనంతపురం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ”నా సొంత ఊరు క‌ర్ణాట‌క‌ రాష్ట్రం హ‌వేరీ జిల్లా నెల‌గోల్ గ్రామం. ఇది నా సొంత ఇల్లు. ఇదే నా సొంతూరు. నా గురించి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి నా ఇంటి ఫొటోతోనే స‌మాధానం చెబుతున్నాను. నాపై అనుమానం ఉన్న వారందరు ఈ ఇల్లు నాదేనా? లేక వేరేవాళ్లదా? తెలుసుకోవాలి” అంటూ ఆయ‌న రాసుకొచ్చారు.

ఇటీవలే అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రకాశ్‌ను విధుల నుంచి జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప.. డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాశ్..’సేవ్ ఏపీ పోలీస్’ అంటూ ప్లకార్డు పట్టుకున్నాడు. దాంతో గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు.