This is my last election. Chandrababu sensational comments
mictv telugu

ఇదే నాకు చివరి ఎన్నిక.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

November 17, 2022

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని… ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. కర్నూల్ జిల్లా పత్తికొండలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న చంద్రబాబు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో నన్ను, నా భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు వాపోయారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చారని ధ్వజమెత్తారు.

మీరు గెలిపించి పంపిస్తే.. కౌరవ సభను.. మళ్లీ గౌరవ సభగా మారుస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. అసెంబ్లీలో అడుగు పెడుతానని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు.  ‘టీడీపీ అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు కట్ చేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎలాంటి సంక్షేమ పథకాలు కట్ చేయను.. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సీఎం జగన్ మాదిరిగా అప్పులు చేయనని.. ఆదాయం పెంచుతానని’ పేర్కొన్నారు. ఎంపీలను కూడా అమ్ముకున్న వ్యక్తి సీఎం జగన్ అని ఫైర్ అయ్యారు.
2003లో నాపై 23 మందు పాతరలు పేలిస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.. ఆ ఆరాచక శక్తుల్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని.. తప్పులు చేస్తే వైఎస్‌ జగన్ కాపాడలేరని హెచ్చరించారు.