బీహర్ సీఎం నితీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగం చేస్తున్న ఓ యువరైతును సీఎం వారించారు. వ్యవసాయానికి సంబంధించి పాట్నాలోని బాపు సబాగార్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్’ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమిత్‌కుమార్ అనే యువ వ్యవసాయ-పారిశ్రామికవేత్త సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ ఇంగ్లీష్ లో స్పీచ్ మొదలెట్టారు.
పూణేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తాను.. అన్నింటిని వదులుకుని సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టానని, ఇందుకు సీఎం నితీష్ కుమార్ తగిన వాతావరణం కల్పించారంటూ ప్రశంసలు కురిపిస్తుండగా.. సీఎం నితీష్ కుమార్ కల్పించుకొని, చేతిలో ఉన్న మైక్రోఫోన్తో.. కాస్త ఆగాలని అతడికి సైగ చేశారు. ‘‘మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో ఎందుకు పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని మీరు అభ్యసిస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. నేనూ ఇంగ్లీష్ మీడియంలోనే ఇంజనీరింగ్ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు ఆ భాషను ఎందుకు ఉపయోగించాలి’’ అని యువకుడిని ప్రశ్నించారు. చివరకు క్షమాపణ చెప్పి ప్రసంగం కొనసాగించాడు యువరైతు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం మాతృభాషా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. ఇదే రోజున బిహార్ సీఎం మాతృభాషపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ ఘటనపై బీజేపీ వ్యంగస్త్రాలు సంధించింది. నీతీశ్ కుమార్కు ఆంగ్లంతో సమస్యా? లేదంటే దాన్ని వాడిన విధానంతోనా అని ప్రశ్నించింది. బహిరంగ సభల్లో ఇలా సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ విమర్శించారు.