This is the 11 sankranthi That Chiranjeevi and Balakrishna movies fighr at the box office
mictv telugu

సంక్రాంతి బరిలో చిరు వర్సెస్ బాలయ్య.. ఇది 11 వ సారి..

January 9, 2023

This is the 11 sankranthi That Chiranjeevi and Balakrishna movies fighr at the box office

ఈసారి సంక్రాంతి పండుగ.. టాలీవుడ్ మాస్ అభిమానులకు మాంచి కిక్ ఇవ్వనుంది. మెగా మాస్ హీరో చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణల సినిమాలు ఒక్కరోజు తేడాతో ఈ పండుగ సందర్భంగా విడుదల కానున్నాయి. పందెంకోళ్లు పోటీ పడ్డట్టు ఈ అగ్రహీరోలు.. నువ్వా? నేనా? అనే రేంజ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరసింహా రెడ్డిగా ఒకరు, వాల్తేరు వీరయ్యగా మరొకరు.. టీజర్లు, ట్రైలర్లతో దుమ్ము లేపారు. ఒకదానిని మించి మరొకటి ‘వీర’ లెవల్‌లో ఉన్నాయి. ఇంట్రెంస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించింది. ఇద్దరు అగ్రహీరోలకు ఒకే నిర్మాణ సంస్థ.. ఇలా ఒకేసారి నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. అయితే, ఈ ఇద్దరూ సంక్రాంతి బరిలో నిలవడం ఇదే తొలిసారి కాదు. వీరు నటించిన పలు చిత్రాలు ముగ్గుల పండగ కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఆ సినిమాలేంటో, ఏయే సంవత్సరాల్లో వచ్చాయో చూసేద్దాం..

చట్టంతో ‘చిరు’ పోరాటం.. బాలయ్య ఆత్మబలం


1985లో తొలిసారిగా చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. కె. బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘చట్టంతో పోరాటం’ జనవరి 11న విడుదల కాగా.. అదే రోజు తాతినేని ప్రసాద్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఆత్మబలం’ విడుదలైంది.

దొంగ మొగుడు.. బార్గవ రాముడు


1985 తర్వాత 1987 సంక్రాంతికి చిరు, బాలయ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ ఏడాది జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన ‘దొంగ మొగుడు’ విడుదలైంది. కొన్ని రోజుల తేడాతో జనవరి 14న బాలయ్య ‘భార్గవ రాముడు’ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డినే.

ఒకరు దొంగ.. మరొకరు పోలీస్

ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మంచిదొంగ’ విడుదలైంది. ఆ మర్నాడే జనవరి 15న బాలయ్య ముత్యాల సుబ్బయ్యల సినిమా ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ విడుదల అయ్యింది.

అమ్మాయికి మొగుడు.. భలే దొంగ

1989 సంక్రాంతి బరిలో జనవరి 14న చిరంజీవి, ఎ.కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు నాలుగు రోజుల ముందే జనవరి 10న అదే డైరెక్టర్ డైరక్షన్ లో వచ్చిన బాలయ్య సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయి, కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఐదుగురి చెల్లెళ్లకు.. ముగ్గురు తమ్ముళ్లకు.. అన్నగా..

ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. యాక్షన్‌ హీరోలు ఫ్యామిలీ డ్రామాల్లో నటించి మెప్పించారు. ముందుగా 1997 జనవరి 4న ‘హిట్లర్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా ‘పెద్దన్నయ్య’ విడులైంది. ఈ రెండింటిలో హీరోలు అన్న పాత్రలో కనిపిస్తారు. హిట్లర్ సినిమాలో ఐదుగురి చెల్లెళ్లకు అన్నగా చిరంజీవి నటించగా… పెద్దన్నయ్యలో బాలకృష్ణ ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా నటించారు. ఈ రెండూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సమరం కోసం.. స్నేహం కోసం

మరో రెండేళ్ల తర్వాత 1999 జనవరిలోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ నెలకొంది. జనవరి 13న బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న కె. ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ రిలీజ్ అయింది. ‘సమరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది.

మూడేళ్ల తర్వాత సేమ్ కాంబినేషన్

2000 సంవత్సరంలో ఇద్దరి హీరోలకి 1997 కాంబినేషన్ రిపీట్ అయింది. అదేంటంటే.. 1997లో వచ్చిన ‘హిట్లర్‌’ కాంబినేషన్ చిరంజీవి- ముత్యాల సుబ్బయ్య 2000 జనవరి 7న ‘అన్నయ్య’ సినిమాతో వచ్చింది. 1997లోని ‘పెద్దన్నయ్య’ కాంబినేషన్‌ బాలకృష్ణ- శరత్‌ 2000లో రిపీట్‌ అయింది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో చిత్రం ‘వంశోద్థారకుడు’ 2000 జనవరి 14న విడుదలైంది. 97లో రెండు కాంబినేషన్‌లు విజయాన్ని అందుకున్నాయి. కానీ 2000 సం.లో మాత్రం ‘అన్నయ్య’ జస్ట్ ఓకే టాక్ తెచ్చుకోగా.. ‘వంశోద్ధారకుడు’ ఫ్లాప్ అయ్యింది.

మృగరాజు.. నరసింహం

 

ఇక ఆ తర్వాతి సంవత్సరం 2001 జనవరి 11న బాలయ్య సినిమా ‘నరసింహనాయుడు’ విడుదలై భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన ‘మృగరాజు’ విడుదలైంది. అప్పటి వరకూ రోజుల తేడాతో పొంగల్‌ సీజన్‌కు చిరు, బాలయ్యల చిత్రాలు విడుదలవగా ఆ ఏడాదిలో మాత్రం ఒకేరోజు విడుదలయ్యాయి. మృగరాజు చిరంజీవి కెరీర్‌లోనే డిజాస్టర్ గా నిలిచింది.

లక్ష్మీనరసింహా వర్సెస్‌ అంజి


మళ్లీ మూడేళ్ల తర్వాత బాలయ్య, చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004లో బాలకృష్ణ హీరోగా దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ తెరకెక్కించిన ‘లక్ష్మీనరసింహా’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అంజి’ చిత్రాలు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ‘లక్ష్మీ నరసింహ’ సూపర్ హిట్ కాగా.. ‘అంజి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఖైదీ నెం.150.. శాతకర్ణి @100


కొన్నాళ్లు పాలిటిక్స్‌లో ఉన్న చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చి, నటించిన తొలి చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. వి. వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 11న విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా అదే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్‌లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాంచి మాస్ క్యారెక్టర్ తో వీర సింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారన్నది తేలాల్సి ఉంది.