ఇదేం ఆచారం స్వామీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం ఆచారం స్వామీ..!

March 12, 2022

bfbfd

తమిళనాడులో ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆచారిస్తున్న వింత ఆచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదేం ఆచారం స్వామీ అంటూ నెటిజన్స్ కామెంట్ల మీద కామెంట్స్ చేస్తున్నారు. దేవుడికి మొక్కులను తీర్చుకోవడం కోసం ఆ గ్రామ ప్రజలు మరుగుతున్న నెయ్యిని ఒళ్ళంతా పూసుకోవడంతోపాటు.. మరుగుతున్న నెయ్యిలో నుంచి వంటకాలను చేతులతో తీస్తున్నారు. తమ ఒంటిని మరుగుతున్న నెయ్యితో కాల్చుకొని మొక్కులు తీరిస్తే స్వామి వారు.. కోర్కెలు నెరవేరుస్తారని ఆ గ్రామస్థులు విశ్వసిస్తారట. మరి ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ? ఎందుకు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు? అనే విషయాలను తెలుసుకుందామా..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్ జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని పులియందర్‌కోట్టై గ్రామం మూఢ నమ్మకాలకు పరాకాష్టగా మారింది. గ్రామంలో ఏటా 200 ఏళ్ల నాటి శ్రీమరనాడు కరుప్పనస్వామి ఆలయ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అగ్గిపుల్లలు, ఇరవై ఒక్క కన్నుల పటాకులు తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

అయితే, పండుగలో ప్రధాన ఘట్టం.. నెయ్యి మరుగుతున్న పాత్రలో వంటలను చేతులతో కాల్చే కార్యక్రమం. ఈ ఉత్సవాల్లో ముందుగా పట్టణంలోని శ్రీమంతయమ్మన్ ఆలయ పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఉపవాసం ఉన్న భక్తులు చేతులకు వేడి వేడిగా కాచిన నెయ్యి పూసుకుని, చేతులు, మొహం, కాళ్లపై చల్లుకుని, చేతితో టపాకాయలు తీసుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా మరుగుతున్న నెయ్యిలో ఉన్న వంటకాలను తమ చేతులతో తీసి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. ‘మా ఒంటిని కాల్చుకొని మొక్కులు తీరిస్తే స్వామి వారు.. కోర్కెలు నెరవేరుస్తారు’ అని అన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతుండటంతో మూఢ భక్తికి ఇది నిదర్శనమంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.