ఏపీలో రాజకీయం ప్రస్తుతం బీసీలు కేంద్రంగా నడుస్తున్నాయి. బీసీలకు తామంటే తాము న్యాయం చేశామని టీడీపీ, వైసీపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ బీసీలకు అధికారాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. వారికి పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తోంది. అంతేకాక, వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై కసరత్తు మొదలెట్టింది.
ఈ క్రమంలో బుధవారం విజయవాడలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు ఈ సభ జరుగనుంది. దీనికి రాష్ట్రంలోని బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మెన్లు, డైరెక్టర్లు, పట్టణ స్థాయిలో ఉండే ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొననున్నారు. నలుమూలల నుంచి 80 వేల మంది బీసీ ప్రతినిధులు పాల్గొనేలా వైసీపీ చర్యలు చేపడుతోంది. ఈ సభలో బీసీలకు మరింత రాజ్యాధికారాన్ని కట్టబెట్టేలా నిర్ణయాలు, తీర్మానాలు ఉంటాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సభ నిర్వహణ కోసం ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన సీనియర్ బీసీ నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చించారు. ఈ సభకు ప్రస్తుత, మాజీ మంత్రులు కూడా హాజరవగా మహాసభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనాయకత్వం పసందైన వంటకాలు తయారు చేయిస్తోంది. ఉదయం ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్ ఐటెంలు ఉండగా, మధ్యాహ్నం భోజనంలో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్య, కోడిగుడ్డు, చాపల పులుసు, పెరుగు, చక్కెర పొంగలి మెనూలో ఉన్నాయి. శాఖాహారుల కోసం పనసకాయ ధమ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు, పప్పు టమోటా, గోంగూర పచ్చడి, సాంబార్, పెరుగు, చక్కెర పొంగలి ఉంటుంది.