తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయల్దేరారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్ కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్ధామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలిస్తారు. తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రమే కొండగట్టుకు చేరుకున్న మంత్రి గంగుల కమలాకరర్, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి బడ్జెట్ లో రూ. 100కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆలయాన్ని ఎలా అద్భుతంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై కేసీఆర్, అధికారులతో చర్చించనున్నారు.
కాగా సీఎం కొండగట్టు పర్యటన ఈనెల14నే ఉంది. అయితే మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ ఉంటుందని..ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఆలయ రూపు రేఖలు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మవారి కన్నీటిధార, బేతాళస్వామి ఆలయాన్ని పరిశీలించనున్నారు. ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలో అంచనాకి వస్తారు. యాదాద్రి తరహాలో ఎలా డెవలప్ చేయాలన్న అంశాన్ని కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.