జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చేది ఇక్కడే.. టీడీపీ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చేది ఇక్కడే.. టీడీపీ ఫైర్

October 13, 2020

పీకల్లోతు వరదనీటిలో ఇళ్ల స్థలాలా? అంటూ టీడీపీ నేతలు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ఇంత నీళ్లల్లో పేదప్రజలు ఇళ్లు ఎలా నిర్మించుకుంటారు? ఇళ్లు కట్టుకున్నాక ఇలాగే నీరు వస్తే వారి పరిస్థితి ఏంటని టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. పేదలకు కేటాయించిన ఈ స్థలంలో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుని ఉండగలరా అని ప్రశ్నించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 

సుమారు నాలుగు అడుగులకు పైగా నీరు వచ్చి నిలిచింది. నీట మునిగిన ఆ ప్రదేశంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం అధికారులు ఎనిమిదిన్నర ఎకరాల భూమిని కేటాయించారు.  వర్షాలు పడుతున్న ప్రతిసారీ ఈ స్థలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వరకుల రాజా, పార్టీ నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి టీడీపీ జెండాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన ఈ స్థలాల్లో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకొని ఉండగలరా? అని వరుకుల రాజా ప్రశ్నించారు. పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదా? అని మండిపడ్డారు.