తండ్రికి అనారోగ్యం.. ‌సైకిల్‌పై 2100 కి.మీ ప్రయాణించిన కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రికి అనారోగ్యం.. ‌సైకిల్‌పై 2100 కి.మీ ప్రయాణించిన కొడుకు

April 5, 2020

This man is cycling 2,100 km from Mumbai to Jammu and Kashmir to see his ailing father

తనను కనిపెంచిన తండ్రి చావు అంచుల్లో ఉన్నాడు. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవాలి అనుకున్నాడు ఓ యువకుడు. తండ్రి అనారోగ్య వార్త వినగానే సైకిల్ మీద తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2100 కిలోమీటర్లు పెడల్స్ తొక్కాడు. కరోనా విలయతాండవంలో, లాక్ డౌన్ ఆంక్షల్లో గుండెలు పిండేసే ఘటన ఇది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ ముంబైలో లిబ్రా టవర్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య గత మంగళవారం ఇంటినుంచి ఫోన్ చేసి తండ్రికి గుండెనొప్పి వచ్చిందని.. బతుకుతారో లేదోనని చెప్పింది. దీంతో తన తండ్రిని కాపాడుకోవాలని ఆరిఫ్ అక్కడినుంచి బయలుదేరాలనుకున్నాడు. కానీ, లాక్ డౌన్ ఉండటంతో ఏం చెయ్యాలో తోచలేదు. ఎలాగైనా ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు. స్థానికుడు అయిన మరో వాచ్‌మెన్ వద్ద రూ.500 లకు సైకిల్ కొనుగోలు చేశాడు. దానిమీద గురువారం తన స్వగ్రామానికి బయలుదేరాడు. చేతిలో రూ.800 పెట్టుకుని, బ్యాగులో కొన్ని నీళ్ల బాటిళ్లు పెట్టుకుని బయలుదేరాడు. 

అయితే దారిలో అతన్ని చాలామంది పోలీసులు ఆపగా అసలు విషయం చెప్పానని.. కానీ, ఎవ్వరూ సహాయం చెయ్యలేదని వాపోయాడు. ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. దీంతో ఇంటివద్ద పరిస్థితి ఏంటో అనే ఆందోళన ఆరిఫ్‌లో ఉంది. తనకు అన్నదమ్ములు ఎవరూ లేరని.. ఉన్న ఊళ్లో పనులు లేక ఇంతదూరం రావాల్సి వచ్చిందని తెలిపాడు. ఎలాగైనా తన తండ్రిని కాపాడుకోవాలని అన్నాడు. రాత్రిపూట రోడ్డు పక్కన పడుకుని పగలంతా సైకిల్ తొక్కుతున్నానని చెప్పాడు. తండ్రి అనారోగ్యం బాధను ఓవైపు.. చివరికి చేరుతానా లేదా అన్న ఆందోళన మరోవైపు గుండెలో అదుముకుని తన సైకిల్ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం జమ్మూకశ్మీర్ అధికారుల దృష్టికి వెళ్లగా వారు స్పందించారు. అతన్ని తన ఊరికి చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.