వైరల్ ఫ్రెండ్‌షిప్.. నడవలేని కుక్క, ఎగరలేని పావురం - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ ఫ్రెండ్‌షిప్.. నడవలేని కుక్క, ఎగరలేని పావురం

February 21, 2020

xfc vxcfb

నడవలేని కుక్కకు-ఎగరలేని పావురానికి స్నేహం కుదిరింది. మూగ సైగలతోనే ఒకటంటే ఒకదానికి ఎంత ప్రేమో స్పష్టం చేసుకుంటాయి. అది చిన్నగా భౌభౌ అంటే ఇది తనదైన భాషతో దానిని అక్కున చేర్చుకుంటుంది. జాతి వైరం లేకుండా అవి అలా అంత అన్యోన్యంగా ఉండటం చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. మనుషుల్లో మాదిరి వీటిమధ్య కూడా ఇంత చక్కని స్నేహం కుదరడం చాలా మందిని ఆకట్టకుంటోంది. 

ఇవి రెండు ప్రస్తుతం మియా ఫౌండేషన్‌లో ఉన్నాయి. ఆ సంస్థ వైకల్యాలతో బాధపడుతున్న జంతువులు, పక్షులకు పునరావాసం కల్పించి వాటిని సంరక్షిస్తుంటుంది. అలా వారు ఎగరలేకుండా ఉన్న పావురాన్ని, నడవలేని కుక్కపిల్లను తమ సంరక్షణశాలకు తీసుకువచ్చారు. వాటికి తగిన చికిత్స ఇచ్చి, వాటి ఆలనాపాలనా చూస్తూ వచ్చారు. వాటికి ముద్దుగా హర్మన్, లుండీ అని పేర్లు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. అవి రెండూ కలిసి ఆడుకోవడం, సరదాగా ఉండటం చూసి ఫౌండేషన్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హర్మన్, లుండీ మధ్య కొత్త స్నేహం వికసించింది అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘చూడ ముచ్చటగా ఉంది వాటి స్నేహం’ అని ఓ నెటిజన్ అన్నాడు. ‘అవి తొందరలోనే నయం అయి పావురం ఎగరాలి, కుక్క నడవాలి అని కోరుకుంటున్నాం’ అని మరింకొంతమంది తెలిపారు.