లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో తెగ కాలక్షేపం చేస్తున్నాడు. తన అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వరుసగా తెలుగు సినిమా పాటలకు, డైలాగులకు నటించేస్తూ వహ్వా అనిపించుకుంటున్నారు. అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులు వేసి ఆహా అనిపించుకున్నాడు. మహేష్ డైలాగ్, ఆ తర్వాత బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు.
తాజాగా వార్నర్ ప్రభుదేవా పాటను ఎంచుకున్నాడు. ’‘ప్రేమికుడు’ సినిమాలోని ముక్కాలా ముకాబులా అంటూ సాగా రీమిక్స్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. యథావిధిగా తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను చూసి అతని అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమళం, హిందీ అభిమానులు అతని ఆటపాటలకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే వార్నర్ సినిమా ఛాన్స్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు.