కన్నతల్లి కోసం బంగారుతల్లి భగీరథ ప్రయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

కన్నతల్లి కోసం బంగారుతల్లి భగీరథ ప్రయత్నం

June 29, 2020

Daughter

ఓ బంగారుతల్లి తన కన్నతల్లి పడుతున్న కష్టాలను చూడలేకపోయింది. అమ్మకోసం ఏదైనా చేయాలని తపించింది. ఇందుకోసం ఆమె భగీరథ ప్రయత్నమే చేసింది. అనారోగ్యంతో ఉన్న తల్లి నీటి కోసం పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిపోయిన ఆ యువతి.. అమ్మ కోసం ఏకంగా ఇంట్లో వట్టి చేతులతోనే బావి తవ్వేసింది. బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల బొబితా సోరెన్ అనే యువతి తల్లి(50) నీళ్ల కోసం నిత్యం అష్టకష్టాలు పడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఆమె నీటి కోసం 200మీటర్ల దూరం వెళ్తోంది. ఆపసోపాలు పడుతూ నీళ్లు తెస్తున్న తల్లిని చూసి బొబితా హృదయం ద్రవించింది. 

ఈ క్రమంలో బొబితా ఓ నిర్ణయం తీసుకుంది. తన చేతులనే ఆయుధాలుగా భావించింది.  కష్టపడి ఇంట్లోనే 15 అడుగుల లోతుగా ఓ బావి తవ్వేసింది. తాను బావి తవ్వడం వెనుక కష్టం గురించి బొబిత మాట్లాడుతూ.. ‘మా నాన్న, సోదరుడు చాలా గట్టిగా తాళ్లు కట్టారు. వాటి సాయంతో నేను బావి అడుగు భాగానికి వెళ్లి చక్కగా తవ్వగలిగాను. దీంతో మా అమ్మ నీటి కష్టాలు తీరినట్టే’ అని బొబితా ఆనందం వ్యక్తంచేసింది. కాగా, ఎమ్‌ఏ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం బీఈడీ చదువుకుంటోంది.