సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే.. వీళ్లంతా ‘క్యూ నెట్’ అనే కంపెనీలో పని చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. మృతులంతా ఈ కంపెనీలో ఏజెంట్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరుకు BM5 సెంటర్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని, తెర వెనుక క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్(MLM) దందా ఉన్నట్లు తెలిపారు. యువత జీవితాలతో క్యూనెట్(Qnet) చెలగాటం ఆడుతుందన్నారు. మొత్తం 40 క్యూనెట్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురు అమాయకులు మృతి చెందిన ఘటనలో క్యూ నెట్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మోసపూరిత సంస్థల కదలికలపై నిఘా పెట్టాలని చెప్పారు.
అయినా తీరు మారడం లేదు..
భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందని, క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందన్నారు సజ్జనార్. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసినా.. ఈడీ ఆస్తులను జప్తు చేసినా తీరు మారడం లేదన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని, ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సజ్జనార్.. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని చెప్పారు.
వాళ్ల మాయలో పడకండి
“యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్షిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని అద్దెకి ఇవ్వాలి. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి.. ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దు” అని సజ్జనార్ తెలిపారు.