Those great people are our inspiration: Modi
mictv telugu

ఆ మహానీయులే మనకు స్ఫూర్తి: మోదీ

August 15, 2022

Those great people are our inspiration: Modi

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపటిక్రితమే ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ”ముందుగా దేశ ప్రజలందరికీ 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి ఆ మహానీయులే మనకు మార్గదర్శకులు. ఆ మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి. దేశం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు వారి ప్రాణాలను త్యజించారు. ఈ వేళ మనకు ఆ త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. మన ముందున్న మార్గం కఠినంగా ఉంది. లక్ష్యాల సాధన బాధ్యత మనపైనే ఉంది. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ, దేశం నిలిచి గెలిచింది. స్వచ్ఛ భారత్, ఇంటింటికి విద్యుత్ సాధన అంత తేలికైన విషయం కాకున్నా, లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తోంది” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా యువత స్టార్టప్‌లతో ముందుకొస్తోందన్నారు. మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని మోదీ వివరించారు. మహాత్ముని ఆశయాలకు, భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆశలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోందన్నారు.

”వచ్చే 25 ఏళ్లు అత్యంత ప్రధానమైనవి కేంద్రం, రాష్ట్రాలు ప్రజల ఆశల సాకారమే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతిక్షణం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోంది. ప్రపంచ దేశాల సరసన నిలబడేందుకు సమష్టి కృషి చేయాలి. దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోంది. భారత్ ఇవాళ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. ప్రపంచ ఆకాంక్షల సాకారానికి భారత్ సిద్ధంగా ఉంది. రాజకీయ సుస్థిరత వల్ల ప్రయోజనాలను భారత్ ప్రపంచానికి చూపింది. వచ్చే 25 ఏళ్ల అమృతకాలం మనకు అత్యంత ప్రధానమైనది. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి” అని మోదీ పిలుపునిచ్చారు.