Those lands belong to the people of Telangana: KTR
mictv telugu

ఆ భూములు తెలంగాణ ప్రజలవి: కేటీఆర్

June 20, 2022

Those lands belong to the people of Telangana: KTR

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడిది? అని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమ్మాలని అనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులు తెలంగాణ ప్రజలకు చెందినవి అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు.

”ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలని అనుకొంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులు తెలంగాణ ప్రజలవి. పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ఆయా సంస్థలను ప్రైవేటీకరించడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హకు కేంద్రానికి ఎక్కడిది. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల అమ్మకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటీవరకు దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించకుండా మోదీ ప్రభుత్వం పకోడీ కహానీలు చెప్తుంది. ప్రజలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకొనే పనిలో బిజీగా ఉంది. ఒకప్పుడు ప్రజల ఆత్మగౌరవానికి, దేశాభివృద్ధికి చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్ముతుంది. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు ఇచ్చిన ఎన్నో హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో రాష్ట్ర ప్రజలకు చెందిన రూ.40 వేల కోట్ల ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తుంది” అని కేటీఆర్ దుయ్యబట్టారు.

తెలంగాణలోని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన పీఎస్‌యూలను అమ్మడానికి బదులు వాటిని పునరుద్ధరించి, బలోపేతం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. అలా చేయకుండా ఆ కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకొందామనుకొంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని, వాటిని తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆ సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.