Those students cannot be allotted seats here: Centre
mictv telugu

ఆ విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వ‌లేం: కేంద్రం

September 16, 2022

ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో వైద్య విద్య‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి, భార‌త్‌కు వచ్చేసిన భారతీయ విద్యార్థుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాకిచ్చింది. ఆ విద్యార్థుల‌కు మ‌న దేశంలోని వైద్య క‌ళాశాల‌ల్లో సీట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేమ‌ని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ విచారించింది. దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొన్న అంశంపై విచారణ జరిపింది.

”నీట్ ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్‌లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే, ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీతో మాకు అభ్యంతరం లేదు. అయితే, ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు” అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది.

మరోపక్క ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అందులో ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్యను పూర్తి చేయొచ్చని తెలియజేసింది. ఏది ఏమైనప్పటికి ఉక్రెయిన్‌లో అభ్యసిస్తున్న వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి వచ్చిన భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమాయంలో పడ్డారు.