those three who were caught by the police in the matter of bargaining with four TRS MLAs..
mictv telugu

ఆ ముగ్గురిలో ఒకరు కేటరింగ్ ఏజెంట్.. మరో ఇద్దరు ఎవరంటే..

October 27, 2022

 

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రలోభపెట్టిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతరావు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సింహయాజి, రామచంద్ర భారతి, నందకుమార్ అనే వ్యక్తులు ప్రలోభపెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లతో పాటు పదవులు, కాంట్రాక్టులు ఆశ జూపారని.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అంటున్నారు. మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్‌లో ఇదంతా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు విడుదల చేశారు. వీడియోల్లో ఎమ్మెల్యేలతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారి బ్యాంక్ గ్రౌండ్ ఏంటి.? అనే ప్రశ్నలు మిగతా పార్టీలకు చెందిన నాయకులతో పాటు సదరు సగటు సామాన్యుడికి కూడా తలెత్తుతున్నాయి.

పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ముగ్గురిలో ఇద్దరు స్వామీజీలని పోలీసులు చెబుతున్నారు. వీరిలో నీలం రంగు చొక్కా ధరించిన వ్యక్తి రామచంద్ర భారతి ఉత్తర కాశీలోని కపిలాశ్రమానికి అధిపతి అని ప్రాథమిక సమాచారం. కేంద్రంలో కీలక హోదాలో ఉండి, బీజేపీలో నంబర్‌- 2 గా చక్రం తిప్పుతున్న ప్రముఖుడికి ఈయన అత్యంత సన్నిహితుడట. ఆ ప్రముఖ నాయకుడికి ఈ స్వామీజీ కుడిభుజంలాంటి వాడని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.

మరో స్వామీజీ పేరు వెంకటనాథ సింహయాజి(పసుపు రంగు కండువా ధరించిన వ్యక్తి). తిరుపతిలోనూ, కడపలోనూ మంత్రరాజ మఠం పేరుతో ఆయనకు ఆశ్రమాలున్నాయి. ఈ ఇద్దరు స్వామీజీల వద్దకూ కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రముఖులంతా తరచూ వచ్చి వెళ్తున్నట్టు ఫొటో సాక్ష్యాలున్నాయి.

ఇక మూడో వ్యక్తి నంద కుమారి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి. నగరంలోని చైతన్యపురిలో ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఆయన గతంలో ఉస్మాన్‌గంజ్‌ మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేసేవారు. తర్వాత అంబర్‌పేట శివం రోడ్డులో హోటల్‌ ప్రారంభించారు. క్యాటరింగ్‌ రంగంలోకీ దిగారు. బడా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఉన్నతాదాయవర్గాలకు క్యాటరింగ్‌ చేసేవారు. ఇతను బీజేపీ వర్గాలకు సన్నిహితుడు. ఆయన హోటల్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే ప్రారంభించారు. బండి సంజయ్‌ తదితర బీజేపీ నేతలందరితోనూ నందు దిగిన ఫొటోలున్నాయి. ఈ ముగ్గురూ కూడా బీజేపీ నేతలతో దిగిన ఫొటోలు తాజా ఘటన తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.