కేసీఆర్‌కు పీకే ఉంటే మాకు ఏకేలు ఉన్నాయి : రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు పీకే ఉంటే మాకు ఏకేలు ఉన్నాయి : రేవంత్ రెడ్డి

March 4, 2022

 

revanth

రాబోయే ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్‌కు పీకే ఉంటే మాకు ఏకే 47లా పనిచేసే 40 లక్షల మంది ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో డిజిటల్ సభ్యత్వ నమోదుకు కృషి చేసిన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంకో పది లక్షల సభ్యత్వాలు పెంచితే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం. సభ్యులకు 2 లక్షల ఇన్సూరెన్స్‌ కల్పించి, వాటి పర్యవేక్షణ కోసం వ్యక్తిన నియమిస్తున్నాను. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానిని అందుకునేందుకు నాయకత్వం మరింత ఉత్సాహంతో పనిచేయాలి.

ఎలాంటి పైరవీలు లేకుండా కష్టపడి పనిచేసే వారికి టిక్కెట్లు ఇప్పించే బాధ్యత నాది. పని చేయని వారికి ఎలాంటి పదవులు, అవకాశాలు రాకుండా నేనే అడ్డుపడతా’నని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అలాగే క్రమశిక్షణ లేని నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రతి బూత్ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజకవర్గానికి పీసీసీ మెంబర్ ఇస్తాం. లేకుంటే ఎంత పెద్ద నాయకుడైనా పక్కన పెట్టేస్తాం. సభ్యత్వం బాగా చేసిన వారి గురించి అధినాయకత్వానికి సమగ్ర నివేదిక ఇస్తాను. పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టే వారిని, కార్యక్రమాలను తేలిగ్గా తీసుకునే నాయకులకు పదవుల విషయంలో ఎలాంటి ప్రాధాన్యత ఉండబోద’ని హెచ్చరించారు.