దొంగోడి దేశభక్తి.. గోడపై క్షమాపణ రాసి.. - MicTv.in - Telugu News
mictv telugu

దొంగోడి దేశభక్తి.. గోడపై క్షమాపణ రాసి..

February 21, 2020

xfb

దొంగలు తాము దోచుకోబోయే ఇల్లు ఎవడిదైతే మాకేంటి అన్నట్టు అందినకాడికి ఊడ్చుకుని పోతారు.  కానీ, ఈ దొంగ మాత్రం ఫక్తు మూస దొంగలకు చాలా విరుద్ధం. తాను దొంగతనం చేయడానికి వెళ్లింది ఓ మిలటరీ అధికారి ఇంటికి అని గతుక్కుమన్నాడు. దొంగతనం మానుకుని సదరు మిలటరీ అధికారికి క్షమాపణలు చెప్పి తన దేశభక్తిని చాటుకున్నాడు. దొంగలో కూడా నికార్సయిన దేశభక్తి ఉంటుందని నిరూపించిన ఈ ఘటన కేరళలోని తిరువంకులంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఓ దొంగ తిరువంకులంలోని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. వచ్చిన పని చేసుకు పారిపోవాలి కాబట్టి చకచకా సర్దుతున్నాడు. ఇంతలో అతనికి ఆ ఇంట్లో మిలటరీ టోపీ కనిపించింది. దానిని చూసి అతను షాక్ అయ్యాడు. తాను దోచుకోవడానికి వచ్చింది ఓ మిలటరీ అధికారి ఇంటికా అనుకుని.. వెంటనే తన చర్యలు ఆపేశాడు. వారే గనక లేకుంటే నాలాంటి దొంగ అయినా, పోలీస్ అయినా ఎలా బతుకుతారు? అని అనుకున్నట్టున్నాడు. 

వెంటనే ఆ వస్తువులను ఎక్కడివక్కడ పెట్టేసి బయటకు వచ్చాడు. ఓ మార్క్‌తో గోడ మీద తీవ్ర పశ్చాత్తాపంతో ఇలా రాసుకొచ్చాడు. ‘నాకు ఇది మిలటరీ అధికారి ఇల్లు అని తెలీదు. ఆ విషయం ముందే తెలుసుంటే ఇక్కడికి దొంగతనానికి వచ్చేవాడినే కాదు. చివరిక్షణంలో మిలటరీ టోపీ చూశాను. అప్పుడు నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. నేను ఏడవ నిబంధనను అతిక్రమించాను’ అని బాధతో రాసి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం ఇంటిని శుభ్రం చేయటానికి వచ్చిన పనిమనిషి ఇంటి తలుపులు బద్ధలై ఉండటం గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ దొంగ అదే రోజు రాత్రి అక్కడికి దగ్గరలోని ఓ షాపులో దొంగతనం చేశాడని గుర్తించారు. కాగా, ఆ ఇంటి యాజమాని అయిన రిటైర్డ్‌ కల్నల్‌ గత కొద్దినెలలుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. దొంగల్లో కూడా దేశభక్తి ఉంటుందా? అనుకుని స్థానికులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.