సజ్జనార్ ఫోన్‌కు వేలల్లో మిస్డ్ కాల్స్, మెసేజ్‌‌ల ఒత్తడి! - MicTv.in - Telugu News
mictv telugu

సజ్జనార్ ఫోన్‌కు వేలల్లో మిస్డ్ కాల్స్, మెసేజ్‌‌ల ఒత్తడి!

December 7, 2019

CP Sajjanar

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. పోలీసులు వాళ్లను చంపి తప్పు చేశారని కొందరు, ఒప్పు చేశారని మరికొందరు స్పందిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా రకరకాలు మాటలు వినబడుతున్నాయి. సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు ఉంది. ఇప్పుడు ఘటన జరిగిన పరిధికి కూడా ఆయనే పోలీస్‌ బాస్‌ కావడంతో నిందితుల ఎన్‌కౌంటర్‌ జరుగుతుందని కొందరు ముందే ఊహించారు. అనుకోకుండా ఎన్‌కౌంటర్‌ జరిగిందని, దీనిని పౌరసమాజం హర్షించడంతో సజ్జనార్‌కు మానసికంగా ఊరట కలిగినట్టేననే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. ఇదిలావుండగా దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ ఓ రకంగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై కొంత ఒత్తిడి తగ్గించిందనే చర్చ కూడా జరుగుతోంది. 

కొందరైతే ఏకంగా సీపీ సజ్జనార్‌కే ఫోన్‌ చేసి చెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం. గత వారం రోజుల్లో సజ్జనార్‌ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయట. దీన్నిబట్టి ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్‌ వర్గాలు అంటున్నాయి.క్షణం తీరికలేకుండా ఆయన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. సీపీ సజ్జనార్‌కే కాదు ఆయన సతీమణి ఫోన్‌కు కూడా వందల సంఖ్యలో మెసేజ్‌లు వచ్చాయని, నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే మెసేజ్‌లే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 

అలా ఎస్‌ఎంఎస్‌‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపినవారిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సజ్జనార్‌ ఎవరితో చర్చించకుండా రహస్యంగానే ఉంచి ఒత్తిడిని భరించారని పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసు విచారణ ఓవైపు, దర్యాప్తు, మరోవైపు ప్రభుత్వ వర్గాల నుంచి సహజంగా ఉండే ఒత్తిడి ఉండనే ఉండింది. దీనికి తోడు ప్రజల డిమాండ్లను తట్టుకున్న సజ్జనార్‌ నిందితులకు చట్టపరంగా శిక్ష పడాలనే దర్యాప్తు కొనసాగించారని అంటున్నారు.