చైనాలో ముస్లింలపై వివక్ష కొనసాగుతోంది. అక్కడి అధికారులు వందల మసీదులను ధ్వంసం చేస్తున్నారు. మానవ హక్కులు, మత స్వేచ్ఛ అనే అంశాలను తుంగలో తొక్కి వీఘర్ ముస్లింలను టార్గెట్ చేసి వరుస దాడులకు పాల్పడుతున్నారు. మతపరమైన సంప్రదాయాలను వదిలెయ్యాలని ముస్లింలపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో వేలాది మసీదులను చైనా అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఓ నివేదిక వెల్లడించింది. వందలాది పవిత్ర స్థలాలు, స్టాటిస్టికల్ మోడలింగ్‌ను ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. చైనాలోని జింజియాంగ్‌లో దాదాపు 16 వేల మసీదులను చైనా అధికారులు నేలమట్టం చేశారు.
జింజియాంగ్‌లో మానవ హక్కులను ఉల్లంఘిస్తూ.. సుమారు 10 లక్షల మంది వీఘర్ ముస్లింలను ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధించారు. స్థానికులపై అధికారులు జులుం చెలాయిస్తున్నారు. సంప్రదాయాలు, మతాచారాలను వదిలిపెట్టాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గడచిన మూడేళ్ళలోనే దాదాపు 8,500 మసీదులను కూల్చివేశారు. ఉరుంకి, కష్గర్ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా కూల్చేశారు. అయితే ఈ ఆరోపణలను చైనా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. జింజియాంగ్ ప్రావిన్స్‌లో మత స్వేచ్ఛ సంపూర్ణంగా ఉందని.. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్కు విశ్వసనీయత లేదని ఆరోపించింది. చైనాకు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని.. జింజియాంగ్‌లో 24 వేల మసీదులు ఉన్నాయని స్పష్టంచేసింది.