పాకిస్థాన్ నుంచి MLA రాజాసింగ్‌కు బెదిరింపు కాల్.!! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్థాన్ నుంచి MLA రాజాసింగ్‌కు బెదిరింపు కాల్.!!

February 21, 2023

threatening calls from Pakistan, says Goshamahal MLA Raja Singh

 

బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా తనను చంపేస్తామంటూ పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మరో కొత్త వార్తతో సంచలనం రేపారు.

 

హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ట్విటర్ వేదికగా… తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి సోమవారం సాయంత్రం 3.34 గంటలకు తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని రాజాసింగ్ వెల్లడించారు.‘‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయంటున్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి’’ అంటూ రాజాసింగ్ ట్వీట్‌ చేశారు.

తనకు కాల్ చేసిన వ్యక్తి వద్ద తన కుటుంబ వివరాలన్నీ ఉన్నాయంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కొన్ని వారాల క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రాజాసింగ్‌ను పోలీసులు మరో వివాదంలో అరెస్టు చేసి విడిచిపెట్టారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం తరచూ రిపేర్లు వస్తూ ఆగిపోతూ.. ఇబ్బందిగా మారిందని.. దానికి నిరసనగా.. కారు ప్రగతి భవన్ వద్దకు రాజాసింగ్ తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు.