ముగ్గురు మొనగాళ్లు.. తొలిసారి  అసెంబ్లీలోకి త్రీ బ్రదర్స్ . - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు మొనగాళ్లు.. తొలిసారి  అసెంబ్లీలోకి త్రీ బ్రదర్స్ .

May 24, 2019

Three brothers enters in to Andhra Pradesh assembly first time in history Y saiprasad reddy balanagi reddy and venkatrami reddy.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డుల మోతలు మోగాయి. వైసీపీ భారీ సీట్లతో అధికారంలోకి రావడమే ఒక రికార్డు. వైసీపీ తరఫున పోటీ పడిన అభ్యర్థులు కూడా తమకు చేతనైన చరిత్రలు సృష్టించారు. వారిలో ముగ్గురు అన్నదమ్ముళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. ఏపీ చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ముగ్గురు తోబుట్టువులు ఒకే పర్యాయంలో చట్టసభలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.

ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని నుంచి మళ్లీ గెలిచారు. ఆయన సోదరుడు వై.బాలనాగిరెడ్డి అదే జిల్లా మంత్రాలయం నుంచి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరో సోదరుడు వె.వెంకట్రామి రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక తల్లిబిడ్డలైన వీరు ముగ్గురూ గెలవడం ఒక ఎత్తయితే, వైసీపీ టెకెట్లపైనే గెలవడం మరో ఎత్తు. బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి.. వైసీపీ జెల్లకొట్టి టీడీపీలో చేరతారని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని వారు చెప్పుకొచ్చారు.

అమ్మ చెప్పింది..

తాము ముగ్గురం గెలుస్తామని తమ తల్లి జోస్యం చెప్పిందని సాయిప్రసాద్ చెప్పారు. తమలో ఒకరు మంత్రి అవుతారని కూడా ఆమె చెప్పిందని, ఆమె మాటలన్నీ నిజం  కావడంతో మంత్రి పదవి కూడా నిజం అవుతుందని అన్నారు. తమ తల్లి సాయిబాబా భక్తులని, ఆమెకు వచ్చిన కలలు నిజమయ్యాయని చెప్పారు.