స్పైడర్‌మేన్ కావాలని సాలీడుతో కుట్టించుకుని కుయ్యో మొర్రో..
పిల్లలకు స్పైడర్ మేన్ సాహసాలు ఎంతో నచ్చుతాయి. అయితే ఆ సాహసాలు సినిమాలలో చూసేవరకు, పుస్తకాలలో చదివే వరకే బాగుంటాయి. అలాంటి సాహసాలు సామాన్యులు చెయ్యలేరు. అయితే, బొలీవియా దేశంలోని చయాంట పట్టణానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్పైడర్ మేన్‌లా తయారవ్వాలనుకుని వీరత్వానికి పోయారు. కుయ్యో మొర్రో అని ఆసుపత్రిపాలయ్యారు. వారు తొలుత నుంచి స్పైడర్ మేన్ సినిమాలు విపరీతంగా చూశారు. కామిక్ బుక్‌లలో చూసి అతడిలాగే అడ్వెంచర్స్ చేయాలని అనుకున్నారు. 8, 10, 12 ఏళ్ల వయసులో ఉన్న ఆ పిల్లలు ముగ్గురూ సాలీడుతో కుట్టించుకుంటే దాని లక్షణాలు వచ్చి స్పైడర్ మేన్‌లా మారిపోతామని భ్రమపడ్డారు. మే 14న ఒక ప్రమాదకర బ్లాక్ విడో సాలీడును పట్టుకుని దాన్ని ఓ కర్రతో పొడిచారు. దీంతో అది వీరిమీదరకు రివర్స్ అయి కుట్టడం ప్రారంభించింది. అన్నదమ్ములు ముగ్గురూ వరుసగా దాంతో కుట్టించుకున్నారు.
వారు అనుకున్న లక్షణం దేవుడెరుగు.. దాని విష ప్రభావానికి కాసేపటికే వారు అపస్మారక స్థితికి వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన వారి తల్లి వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చింది. అప్పటికే సాలీడు విషం శరీరం మొత్తం పాకడంతో వారి పరిస్థితి విషమించింది. దాంతో వారిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్లు ఈ కేసు హ్యాండిల్ చేయలేమని చెప్పడంతో లాపాజ్‌లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు జ్వరం, వణుకు, ఒళ్లంతా చెమటలు పట్టడం, కండరాల నొప్పితో బాధపడుతున్నారు. లాపాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని తిరిగి కోలుకునేలా చేశారు. మరో వారం తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు డిశ్చార్జి కానున్నారు. సినిమాల్లో చూపించేదంతా నిజం కాదని పిల్లలు తెలుసుకోవాలని, ఈ ఘటన వారికో కనువిప్పు కావాలని.. బొలీవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎపిడెమాలజీ చీఫ్ వర్జీలియో పీట్రో అభిప్రాయపడ్డారు.