Three burned in 'electrical incident' at Google center in Council Bluffs
mictv telugu

గూగుల్ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. అంతరాయానికి అదే కారణం..

August 9, 2022

అమెరికాలో గూగుల్ కు చెందిన ఓ డేటా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరింగింది. దీని కారణంగా సెర్చింజన్ సేవల్లో కొంతసమయం అవాంతరం ఏర్పడింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారిక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. లోవాలోని కౌన్సిల్ బ్లఫ్ లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వారికి కావాల్సిన సాయం అందించనున్నట్లు చెప్పారు.

ఈ ప్రమాదం కారణంగా భారత కాలమానం ప్రకారం గూగుల్‌‌కు చెందిన చాలా సర్వీస్‌ల్లో ఈ ఉదయం 6.37 గంటల నుంచి అంతరాయం మొదలైంది. 7.07 గంటలకు ఈ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో దాదాపు 41వేల మంది ఫిర్యాదులు చేశారు. 502 ఎర్రర్‌తో పాటు 500 ఎర్రర్ వస్తోందని కంప్లైట్స్ చేశారు. ఇక ట్విట్టర్‌లో ఈ విషయంపై ట్వీట్లు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన గూగుల్ సమస్యను పరిష్కరించేసింది. దీంతో గూగుల్ సర్వీస్‌లన్నీ మళ్లీ అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.

మరోవైపు యూజర్లు.. గూగుల్ సేవలకు అంతరాయం కలగడంతో సోషల్ మీడియాలో మీమ్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. “ప్రపంచం అంతమవుతోందా? గూగుల్ డౌన్, గూగుల్ డౌన్” అంటూ మెలిసా రిచర్జ్ అనే యూజర్ ట్వీట్ చేశారు. “ఫస్ట్ టైమ్ గూగుల్ ఎర్రర్ చూపిస్తోంది. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది” అని మరో యూజర్ పోస్ట్ చేశారు. ‘గూగుల్ డౌన్‌. ఇవి చివరి రోజులా!” అంటూ మరో యూజర్ స్పందించారు. అలాగే #googledown హ్యాష్‍ట్యాగ్‍‌పై చాలా మంది యూజర్లు ఫన్నీ రియాక్షన్లు, మీమ్స్ కూడా పోస్ట్ చేశారు.