ఏపీ అసెంబ్లీలో 21న మూడు రాజధానుల బిల్లు? - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ అసెంబ్లీలో 21న మూడు రాజధానుల బిల్లు?

March 18, 2022

g

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు మార్చి 25వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు మొదలైనప్పటీ నుంచి నేటిదాకా వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ..’రాష్ట్రంలో ఇళ్లు కాదు. ఊళ్లు కడుతున్నాము. ఇప్పటికే 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశాము. సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారు’ అని జగన్ అన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం మాట్లాడుతూ.. “మూడు రాజధానుల గురించి గురువారం సీఎం జగన్‌తో చర్చించాం. అనంతరం జగన్ సానుకూలంగా స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెడతామని అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, 3 రాజధానుల శిబిర నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు గుర్నాధం, బేతపూడి సాంబయ్య, ఆదాం తదితరులు వెలగపూడిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రిని కలిశాము. శాసనసభలో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశ పెట్టాలని కోరాము. అంతేకాకుండా ఆయనకు వినతిపత్రాన్ని కూడా అందించాం” అని అన్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల 21న శాసనసభలో 3 రాజధానులపై చర్చించి, బిల్లు ప్రవేశ పెడతామని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ గతకొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.