హైదరాబాద్‌లో వర్షం.. కార్లు ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వర్షం.. కార్లు ధ్వంసం

May 26, 2022

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు(గురువారం) ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఇనుప రేకులు ఎగిరిపోయాయి. అవి ఎగిరి వచ్చి రోడ్డు మీదున్న మూడు కార్లపై పడ్డాయి. దాంతో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని సరూర్‌నగర్‌, గచ్చిబౌలి, కర్మన్‌ఘాట్, సైదాబాద్‌, అంబర్‌పేట్‌, చంపాపేట్‌లో వర్షం కురిసింది. పటాన్‌చెరు, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, దుండిగల్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.నేడు, రేపు ఉరుములతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది.

నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దివులు కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్త వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.