ముగ్గురు మోసగాళ్ళు.. కేంద్ర పథకం పేరుతో ఘరానా మోసం - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు మోసగాళ్ళు.. కేంద్ర పథకం పేరుతో ఘరానా మోసం

March 15, 2019

మోసాలు చేసేవారికి దారులు తక్కువా అన్నట్టే వుంది వరస. రకరకాల దారుల్లో అమాయకుల అవసరాలను ఆసరా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్లు ముగ్గురు కూడా మోసాలు చేయడంలో చేయి తిరిగిన సిద్ధహస్తులు అనాలో, తల పండినవాళ్లు అనాలో మీరే నిర్ణయించండి. ఏకంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట నిరుద్యోగులను నిలువు దోపిడీ చేశారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌ పథకం’ పేరు చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారు. చివరికి బండారం బయటపడి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన హైదరాబాద్‌ చైతన్యపురి ఠాణా పరిధిలో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

Three cheaters.. Big fraud with the name of the central scheme

ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం సమీపంలోని మమూన్‌పల్లికి చెందిన గరికి జాన్సన్‌(24), కడపజిల్లా గండికుంట లెక్కవారి పల్లెకు చెందిన లేఖల కవితారెడ్డి (27),

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన బుద్దరాజు రాధాకృష్ణకాంత్‌(43) ముగ్గురు  2017లో దిల్‌సుఖ్‌నగర్‌లో రాంచంద్రారెడ్డి వద్ద పని చేశారు. రంచంద్రారెడ్డిది ప్రకాశం జిల్లా గిద్దలూరు. అప్పట్లో ఆయన ‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌ పథకం’ కింద అక్షరాస్యతను పెంచడానికి మండల కోఆర్డినేటర్ల నియామకం జరుగుతుందంటూ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. ఆయన వద్ద పనిచేసి అందులోని ట్రిక్కులన్నీ ఔపోసన చేసుకున్నారు వీళ్లు. తర్వాత అక్కడినుంచి బయటకు వచ్చి సొంత దుకాణం తెరిచారు. ఆ దుకాణం పేరు మోసం అని పాపం నిరుద్యోగ యువతకు వాళ్ళు మోసపోయేవరకు తెలియదు.

ముఠాగా ఏర్పడి దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్‌లో 2018 జనవరిలో జీనియస్‌ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌ పథకం కింద కోఆర్డినేటర్ల నియామకం జరుగుతుందని, ప్రతి నెలా రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు భృతి ఉంటుందని నిరుద్యోగులను నమ్మించారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగ యువత 185 మంది వారి మోసానికి బలయ్యారు. ఒక్కక్కరి దగ్గర రూ.80వేల చొప్పున రూ.1.48 కోట్లు వసూలు చేశారు. జీతభత్యాల కింద బిస్కెట్లు వేసినట్టు రూ.4 వేల చొప్పున మూడు నెలలు చెల్లించారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదని వారంతా ప్రశ్నించారు. అప్పటికీ ఇంకా కవర్ చేద్దామని ప్రయత్నించారు. పథకం కింద రూ.2కోట్లు మంజూరయ్యాయని, విడుదలైన వెంటనే ఇస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేశారు.

కానీ వాళ్లు వాళ్ల మాటలను నమ్మకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించి ఇదీ విషయం అని వాళ్లకు చెప్పారు స్వదీప్‌, సాధిక్‌ అనే యువకులు. ఈ నెల 10వ తేదీన చైతన్యపురి పోలీసులను ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి గురువారం నిందితులు ముగ్గురు మోసగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6.06లక్షల నగదు, కారు, 6 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, నగలు, స్థలాలకు సంబంధించిన దస్తావీజులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన రాంచంద్రారెడ్డిపై కూడా విచారణ చేస్తామని చెప్పారు.