సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా!
కరోనా వైరస్ కారణంగా ఎందరో ప్రజాప్రతినిధులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ విపత్కర సమయాల్లో కూడా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను కరోనా వైరస్ భయపెడుతోంది. కరోనా భయంలోనూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు సేవలందిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా భయం పట్టుకుంది. ఆయన ఇంటిముందు ఉండే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ముంబైలోని సీఎం నివాసం 'మాతో శ్రీ' ఎదురుగా ఉండే వీరికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని అధికారులు వెల్లడించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇండియాలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 12,300కు పెరిగింది.