ఒకే ఏడాదిలో ముగ్గురు మృతి.. బాధలో మహేశ్ బాబు
తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజ నటుణ్ని కోల్పోయింది. తెలుగు సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి, టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్‌స్టార్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగానే ఉన్న ఆయనకి ఆరోజు రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, చికిత్స పొందుతూ కృష్ణ ఈరోజు ఉదయం 4 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
కాగా, ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది వరుసగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆ ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో మరణించాడు. నెలన్నర క్రితం ఆయన భార్య ఇందిరా దేవి కూడా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 28వ తేదీన కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై వయసు రీత్యా సమస్యలతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అన్నను, తల్లిని దూరమైన బాధని ఇప్పుడిప్పుడు మరిచిపోతున్న తరుణంలో.. కన్నతండ్రి మరణం హీరో మహేశ్ బాబును మరింత విషాదంలో నెట్టేసింది.