సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూరు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ కార్మికులు అక్కడికక్కడే మరణించారు. రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్య ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులపై ఓ లారీ దూసుకెళ్లింది. అంతే అప్పటిదాకా తమ పనుల్లో నిమగ్నమైన వాళ్లు.. లారీ దూసుకు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న చెట్లకు ఈ తెల్లవారు జామునే నీళ్లు పోస్తుండగా ఏదో పెద్ద శబ్ధం వినిపించింది. ఏంటా అని అటు చూస్తుండగా.. ఓ గుడిసెలో నుంచి దూసుకు వస్తోన్న లారీ కనిపించింది. అది వారిపైకి వేగంగా దూసుకొచ్చి ప్రాణాలు తీసింది. లారీ పటాన్‌చెరు నుంచి శంషాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఓఆర్ఆర్ నుంచి వేగంగా దూసుకు వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా ఓఆర్ఆర్ పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న బాబు రాఠోడ్(48), కమలీ బాయ్ (43), బసప్ప రాఠోడ్ (23)ల ను ఢీకొట్టింది. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా లారీ డ్రైవర్‌ను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ శివారులో.. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్ర మత్తు, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి వీటికి ప్రధాన కారణం.
నాలుగు రోజుల క్రితం దుండిగల్ లో కూడా ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా..11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలన్ని ఏమరుపాటు వల్ల, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల జరుగుతున్నాయి. రెప్పపాటులో జరిగిన ప్రమాదాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫలితంగా బాధిత కుటుంబాల్లో జీవితకాలం చీకట్లను నింపుతుంది. ఏదేమైనా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి ప్రాణాలను కాపాడుకోండి.