శతమానం భవతి..పెళ్లితో ఏకమైన మూడు HIV జంటలు - MicTv.in - Telugu News
mictv telugu

శతమానం భవతి..పెళ్లితో ఏకమైన మూడు HIV జంటలు

July 7, 2020

bvcng

హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చిందంటే చాలు వారి తప్పు లేకున్నా సమాజం నుంచి ఎన్నో చీత్కారాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై ఎంత అవగాహన కల్పించినా ప్రజల నుంచి సానుకూల పరివర్తన రావడం లేదు. ఈ క్రమంలో చాలా మంది హెచ్ఐవీ పాజిటివ్ రోగులు నిరాశలోనే బతుకీడుస్తున్నారు. అలాంటి వారి జీవితంలో వెలుగులు నింపేందుకు మహారాష్ట్ర పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. ఒంటరితనంతో బాధపడకుండా ఉండేందుకు పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మూడు హెచ్ఐవీ జంటలు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యాయి. పోలీసులు, అధికారులే పెళ్లి పెద్దలుగా మారి నూరేళ్లు జీవించాలని దీవించారు. 

బీడ్ జిల్లా పోలీసు యంత్రాంగం మూడు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయించింది. హెచ్‌ఐవీ  కారణంగా పెళ్లి దూరంగా ఉన్న ముగ్గురు యువతులను పాజిటివ్ ఉన్న మరో ముగ్గురు యువకులు పెళ్లి చేసుకున్నారు. కన్యాధానంతో వీరంతా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి సమాజం నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఓ తోడుతో కలసి ఉండాలనే తాము ఇలా చేశామని ఎస్పీ హర్ష పొదార్ తెలిపారు.  కాగా పెళ్లి చేసుకున్న ఈ జంటల్లో ఓ జంట దాదాపు 13 ఏళ్లుగా హెచ్ఐవీ పాజిటివ్ రోగులకు స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. జరిగిన ఈ ఆదర్శ వివాహం చూసి వీరి పెళ్లి చేసిన అధికారులను పలువురు అభినందించారు.