ఎలుకలను, పిల్లులను తినేవాళ్లున్నారని మనకు తెలుసు. కొన్ని తెగలు మరో జీవనాధారం లేక వాటిని వెంటాడి భోంచేస్తుండేవి. అయితే మహానగరాల్లో ఇలాంటి తెగలు, ఘటనలు అరుదు. ఆ కొరత తీర్చాలనేమో కొందరు రంగంలోకి దిగారు. ఓ ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకున్న పిల్లిని దొంగిలించి శుభ్రంగా కోసుకుని మషాలా పెట్టివండుకుని తిన్నారు. బండారం బయటపడ్డంతో ఊచలు లెక్కిస్తున్నారు.
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ ఈ సంఘటన జరిగింది. పిల్లి యజమాని ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి వెలుగుచూసింది. జీకే కాలనీలో ఉన్న తమ ఇంట్లోని పిల్లిని గత నెల 29న ఎవరో ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి దొంగలను గుర్తించారు. పిల్లిని కొట్టేశాక సంచిలో వేసుకుని వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దుండగులను వినాయక్ నగర్‌కు నర్సింగ్, కిరణ్, శంకర్ లుగా గుర్తించారు. వారిపై జంతుహింస, చోరీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.